వాట్సప్‌లో ఇస్తుంది మెటా 2 m ago
ఢిల్లీ: క్యాస్ట్ సర్టిఫికెట్ కావాలంటే మూడు గవర్నమెంట్ ఆఫీసులు, నలుగురు వరకూ వివిధ హోదాల అధికారులు, సిబ్బంది చుట్టూ ఓ వారం రోజులు తిరగాల్సిందే. కరెంటు, నల్లా, ఇంటి పన్ను, ఇతరత్రా బిల్లులు చెల్లించాలంటే సంబంధిత కార్యాలయాల్లో ఇప్పటికీ ఎడతెగని క్యూలలో నిరీక్షణ తప్పదు. తెలుగుదేశం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ చేపట్టిన యువగళం పాదయాత్రలో ఈ సర్టిఫికెట్ల కష్టాలను యువత ఏకరువు పెట్టారు. వాట్సప్ లో ఒక టెక్ట్స్ మెసేజ్ చేస్తే ఇంటికి, మనిషికి అవసరమైన సమస్త వస్తువులు వస్తున్నప్పుడు, సేవలు అందుతున్నప్పుడు.. ఒక సర్టిఫికెట్ కోసం ఆఫీసులు చుట్టూ పనులు మానుకుని మరీ తిరగాల్సిన పరిస్థితికి చెక్ పెడతామని, ప్రభుత్వం రాగానే..వాట్సప్ ద్వారా పర్మినెంట్ సర్టిఫికెట్ పొందే అవకాశం కల్పిస్తామని హామీ ఇచ్చారు.
వాట్సప్‌లోనే సర్టిఫికేట్లు
ప్రతి ఏటా క్యాస్ట్ సర్టిఫికెట్ల కోసం కార్యాలయాల చుట్టూ తిరిగే అవసరం లేకుండా వాట్సప్ ద్వారా పొందే పద్ధతి అందుబాటులోకి తీసుకొస్తున్నారు. అలాగే వివిధ రకాల బిల్లులు వాట్సప్ ద్వారా చెల్లించేయవచ్చు. ఫేస్బుక్, వాట్సప్, ఇన్ స్టా ఫ్లాట్ ఫామ్స్ ద్వారా ప్రపంచమంతా విస్తరించిన మెటాతో కీలక ఒప్పందం కుదుర్చుకోనుంది ఏపీ ప్రభుత్వం. ఐటీ, ఎలక్ట్రానిక్స్, ఆర్టీజీ, విద్యా శాఖల మంత్రి నారా లోకేష్ చొరవతో, మెటా ప్రజలకు, ప్రభుత్వం నుంచి పౌరసేవలు వాట్సప్ బిజినెస్ ద్వారా అందించేందుకు అంగీకరించింది. మెటా ఫ్లాట్ ఫాం వాట్సప్ బిజినెస్ ద్వారా ఇకపై క్యాస్ట్, ఇతరత్రా సర్టిఫికెట్లు వేగంగా, సులభంగా పొందేందుకు వీలు అవుతుంది. అలాగే నకిలీలు, ట్యాంపరింగ్ అవకాశం లేకుండా పారదర్శకంగా ఆన్లైన్లోనే సర్టిఫికెట్ల జారీ ఉంటుంది. మెటా నుంచి కన్సల్టేషన్ టెక్నికల్ సపోర్ట్, ఈ గవర్నెన్స్ అమలు, ఆర్టిఫిషియల్ ఇంటిలిజెన్స్ ద్వారా మరిన్ని సిటిజెన్ సర్వీసెస్ ఏపీ ప్రభుత్వానికి అందించేలా మంత్రి నారా లోకేష్ నేతృత్వంలో ఏపీ అధికారులు, మెటా ప్రతినిధులు ఢిల్లీ లోని 1 జన్‌పథ్ లో జరిగిన కార్యక్రమంలో ఎంవోయూ చేసుకున్నారు.